ఝాన్సీ లక్ష్మీబాయి వీపున బొమ్మ గా నిలిచిపోయిన ఆ బాలుడి పేరు దామోదరరావు. 1849 నవంబర్ 15న జన్మించిన ఆ కుర్రాడ్ని మూడేళ్ళ వయసులో ఝాన్సీ మహారాజు గంగాధర్ రావు దత్తత తీసుకున్నారు. ఈ విషయమై బుందేల్ ఖండ్ లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి కి దరఖాస్తు చేసుకున్నారు. ఆమోదం లభించే లోపే గంగాధరరావు మరణించారు. దీంతో రాణి లక్ష్మీ బాయి దామోదర రావు ను తన కొడుకుగా గుర్తించాలంటూ కలకత్తాలోని గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కి లేఖ రాశారు. కానీ అప్పట్లో వారసులు లేకుండా రాజు మరణిస్తే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకునేవారు. లక్ష్మీబాయి దరఖాస్తును తిరస్కరిస్తూ ఝాన్సీని స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఏడాదికి ఐదు వేలు లక్ష్మీబాయికి పింఛను, వ్యక్తిగత ఆస్తులు ఇస్తామన్నారు. రాజు ఖజానాలోని ఏడు లక్షల ను పిల్లవాడు పెద్దయ్యాక అప్పగిస్తాం అన్నారు. రాజ్యాన్ని బ్రిటిష్ కు అప్పగించడానికి ఇష్టపడని లక్ష్మీబాయ్ యుద్ధానికి దిగటం... గ్వాలియర్ లో
ఓ వంచకుడి మోసంతో వీరమరణం పొందటం అందరికీ తెలిసిందే.
యుద్ధంలో రాణి వీపున ఉన్న బాలుడిని ఆమె నమ్మినబంట్లు కాపాడారు. యుద్ధంలో బతికిన సుమారు 60 మంది బ్రిటిష్ వారి కంట పడకుండా తొమ్మిదేళ్ల దామోదర రావు ను తీసుకుని రహస్యంగా బుందేల్ఖండ్ అడవిలోకి వెళ్లారు. సమీప గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా బ్రిటిష్ గూఢచారులు ఉండేవారు. దాంతో ఎండకు... ఎండుతూ వానకు... తడుస్తూ అడవిలోని చెట్ల ఫలాలు తింటూ చాల కాలం గడపాల్సి వచ్చింది. ఓ వాన కాలంలో దామోదరరావు ఆరోగ్యం దెబ్బతింది. దగ్గర్లోని ఒక గ్రామ పెద్ద 500 రూపాయలు తీసుకొని సాయం చేయడానికి అంగీకరించాడు. తన బంధువైన ఓ వైద్యుణ్ని రహస్యంగా పంపించి దామోదరరావు కు వైద్యం చేయించారు. డబ్బులు అయిపోవడంతో గ్రామ పెద్ద సాయం నిరాకరించాడు. దాంతో గ్వాలియర్ సమీపాన ఉన్న షిప్రికి చేరుకోగానే... తిరుగుబాటుదారుల ని గుర్తించి పట్టుకున్నారు.
అయితే స్థానిక ఆంగ్ల అధికారి ప్లింక్ వద్ద పని చేస్తున్న వ్యక్తి అంతకుముందు లక్ష్మీబాయి సంస్థానంలో ఉండేవాడు. " పదేళ్ల పిల్లవాడు మిమ్మల్ని ఏం చేస్తాడు. అడవుల్లో జంతువుల తిరగాల్సి వస్తుంది. క్షమాభిక్ష పెట్టండి" అని ప్లింక్ కు చెప్పటం... ఆయన పై అధికారులకు సూచించటంతో... మూడు నెలలు జైల్లో పెట్టారు. ఆ తరవాత ఇండోర్ లో ఏడాదికి పది వేల పింఛంతో క్షమాభిక్ష ప్రసాదించారు. ఝాన్సీ కి చెందిన సొమ్ములో ఏ మాత్రం ఆయనకు ఇవ్వలేదు. ఖజానా లోని ఏడు లక్షల ను కూడా దామోదరరావుకు పెద్దఅయ్యాక అందజేయలేదు. 1906 మే 28న తన 58వ ఏట దామోదరరావు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఇండోర్ లోనే మరణించారు.
No comments:
Post a Comment